సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (12:22 IST)

నాసా వ్యోమగామిగా హైదరాబాద్ వాసి.. పేరేంటి?.. నేపథ్యం ఏంటి?

అమెరికా పరిశోధనా సంస్థ నాసా వివిధ పరిశోధనల నిమిత్తం అపుడపుడూ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిస్తూ వచ్చింది. ఇందులోభాగంగా, త్వరలో చంద్రమండలంపైకి వ్యోమగాములను పంపించనుంది. మూన్ మిషన్ ద్వారా ఈ ఆస్ట్రోనట్‌లు చంద్రమండలంపైకి వెళ్లనున్నారు. ఈ మూన్ మిషన్‌కు పంపించే వ్యోమగాముల్లో తెలుగు వ్యోమగామికి ఎంపికయ్యాడు. అతని పేరు రాజాజాన్ వర్పుతూర్ చారి. హైదరాబాద్ నగర మూలాలు కలిగిన ఆస్ట్రోనట్. 
 
అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా ఇచ్చే అత్యంత కఠినతరమైన రెండేళ్ళ శిక్షణను రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చందమామ, అంగారకుడిపైకి నాసా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో రాజా చారి భాగస్వామి కానున్నారు. 
 
రాజా చారి తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌. ఆయన కొన్ని దశాబ్దాల కిందటే ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆయన వయసు 41 యేళ్లు. అమెరికా వైమానిక దళంలో కల్నల్‌గా పనిచేస్తుండగా ఆయన నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. నాసా 2017లో వ్యోమగామి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాజాచారి సహా 11 మందిని ఎంపిక చేసింది. వారికి 2017 ఆగస్టులో శిక్షణ ప్రారంభమై.. దాదాపు రెండున్నరేండ్లపాటు సాగింది. నాసా ఈ దఫా వ్యోమగామి శిక్షణను మరింత కఠినతరం చేసింది. స్పేస్‌ వాకింగ్‌, రోబోటిక్స్‌, ఐఎస్‌ఎస్‌ వ్యవస్థలు, టీ-38 జెట్‌ నడుపడంతోపాటు రష్యన్‌ భాషను నేర్పించారు. 
 
శుక్రవారం హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది వ్యోమగాములకు వెండి మెడల్‌ను బహూకరించారు. వ్యోమగామి శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ‘సిల్వర్‌ పిన్‌'ను బహూకరించడం నాసాలో 1959 నుంచి సంప్రదాయంగా వస్తున్నది. వారు కనీసం ఒక్కసారి అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకొని వస్తే గోల్డ్‌ పిన్‌ బహూకరిస్తారు. 
 
వైమానిక దళం నుంచి అంతరిక్షంలోకి.. 
రాజా చారి అమెరికాలోని అయోవా రాష్ట్రం వాటర్‌లూ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అమెరికా వైమానిక దళంలో కర్నల్‌గా పనిచేస్తున్నారు. ఆయన యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ‘ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌'లో డిగ్రీ పూర్తిచేశారు. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీజీ చేశారు. 
 
ఆ తర్వాత కాలిఫోర్నియా ఎయిర్‌బేస్‌లోని 461-ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా చేరారు. రాజా చారి తండ్రి శ్రీనివాస్‌ చారి స్వస్థలం హైదరాబాద్‌. ఆయన ఇంజినీరింగ్‌ చదివేందుకు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజా చారి భార్య పేరు హోలీ. వారికి ముగ్గురు సంతానం. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే శ్రమించానని, ఉన్నత చదువులు చదివానని రాజా చారి చెప్తుంటారు.