శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:26 IST)

అమెజాన్‌కు కుచ్చుటోపీ.. రూ.30 లక్షలు స్వాహా

సాధారణంగా మనం ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటికి ఏదైనా డ్యామేజీ జరిగితే సదరు సంస్థ దానికి తగిన నష్టపరిహారాన్ని ఇస్తుంది. కస్టమర్‌లకు విలువనిచ్చి కంపెనీలు రీఫండ్‌లు చేయడం లేదా కొత్త వస్తువులను పంపడం జరుగుతుంటాయి. దీన్నే అవకాశంగా భావించిన ఒక వ్యక్తి ఏకంగా అమెజాన్‌కు 30 లక్షల రూపాయల కుచ్చుటోపీ పెట్టాడు.
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహ్మద్ వహువాలా అనే యువకుడు తరచుగా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి సైట్లను నిరంతరం తనిఖీ చేస్తూనే ఉండేవాడు. మొదటిసారి తను ఆర్డర్ చేసిన వస్తువు డ్యామేజీ అయితే సదరు వెబ్‌సైట్ అతనికి నగదు వాపసు ఇవ్వడంతో అతనిలో కన్నింగ్ ఆలోచనలు మొదలయ్యాయి.
 
వెంటనే దాన్ని అమలు చేసేందుకు చాలా నకిలీ ఇమెయిల్ అకౌంట్లు, ఫోన్ నంబర్లను సిద్ధం చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి అమెజాన్ వెబ్‌సైట్‌లో వేర్వేరు పేర్లతో చాలా అకౌంట్లను తెరిచాడు. వాటి ద్వారా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, గాడ్జెట్లను ఆర్డర్ చేసి డెలివరీ తీసుకున్న తర్వాత వాటిని దగ్గర్లోని దుకాణంలో విక్రయించి, ఆపై తనకు వచ్చిన పార్శిల్‌లో వస్తువు లేదని ఫిర్యాదులు చేసేవాడు. దీనితో అమెజాన్ అతనికి డబ్బు వాపసు ఇచ్చేది. ఈ విధంగా ఇప్పటివరకు 30 లక్షల రూపాయలకు మోసం చేసాడు.
 
అయితే తరచుగా ఇలాంటి ఫిర్యాదులు ఇండోర్ నుంచే వస్తుండటంతో అమెజాన్ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మరోసారి మొబైల్ ఫోన్ బుక్ చేసి, దాన్ని దుకాణంలో విక్రయించేందుకు వచ్చిన అతడిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.