శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (08:09 IST)

భారత వాయుసేనలోకి రఫెల్ యుద్ధవిమానాలు...

భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాలను భారత్ సమకూర్చుకుంటోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే ఐదు వార్ జెట్లు స్వదేశానికి చేరుకున్నాయ. వీటిని భారత వాయుసేనలోకి గురువారం లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణమంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ, భారత సైన్యాధికారులు పాల్గొంటారు. 
 
కాగా, ఇరు దేశాల మధ్య కుదిరిన డిఫెన్స్ డీల్ మేరకు.. ఫ్రాన్స్ నుంచి భారత్ 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.60 వేల కోట్లు. ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన డ‌స్సాల్ట్ ఏవియేష‌న్ సంస్థ‌కు భార‌త్‌ ఇప్ప‌టికే సగానికిపైగా డ‌బ్బును చెల్లించింది. 
 
మొద‌టి విడ‌త‌లో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 29న భార‌త్ చేరాయి. ఇందులో రెండు సీట్లు క‌లిగిన శిక్ష‌ణ విమానాలు కాగా, మ‌రో మూడు ఒకే సీటు క‌లిగిన యుద్ధ విమా‌నాలు. విమానాలు భార‌త్‌ చేరిన మ‌రుస‌టి రోజు నుంచే వాయుసేన‌ శిక్ష‌ణ ఇవ్వ‌డం ప్రారంభించింది. 
 
ఈ అత్యాధునిక విమానాల‌ను గురువారం అధికారికంగా ప్రారంభిస్తుండ‌టంతో భార‌త వాయుసేన‌కు చెందిన 17 గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్ర‌న్‌లో రాఫెల్ విమానాలు భాగం కానున్నాయి. ‌అదేవిధంగా రెండో విడ‌త‌లో రానున్న ఈ అత్యాధునిక యుద్ధ‌ విమానాల‌ను ప‌శ్చిమబెంగాల్‌లోని హ‌స్మీరా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా ఉంచనున్నారు.