గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ - ప్రస్తుతం కర్నాటక డీజీపీగా విధులు

praveeni sood
కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) సీబీఐ నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఈయన్ను ఎంపిక చేసింది. ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
అయితే, ఈ పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. 1986 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ రెండేళ్ల పదవీకాలం మే 25తో ముగియనుంది. దీంతో సీబీఐ నూతన డైరెక్టర్‌ నియామకానికి ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను ప్రధానమంత్రి, సీజేఐ, లోక్‌సభలోని ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమై పరిశీలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
వీరిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌, మధ్యప్రదేశ్‌ డీజీపీ సుధీర్‌ సక్సేనా, తాజ్‌ హసన్‌ల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇదిలాఉంటే, ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ డీజీపీ ప్రవీణ్‌ సూద్‌పై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
 
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నారంటూ బహిరంగంగా దుయ్యబట్టారు. అధికార పార్టీకి వంతపాడుతున్న డీజీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని కొన్నివారాలు క్రితం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక డీజీపీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన మరుసటి రోజే సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపిక కావడం గమనార్హం.