శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జులై 2020 (09:26 IST)

అన్నాడీఎంకేలో దినకరన్ పార్టీ విలీనం.. బీజేపీ సయోధ్య?

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేలో ఆ పార్టీ రెబెల్ నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సారథ్యంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జయలలిత అక్రమార్జన కేసులో అరెస్టయి బెంగళూరు పరపణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ ఆగస్టు 14న విడుదలవుతారని, ఆ తర్వాత రెండు పార్టీల విలీనం ఖాయమని బీజేపీ వర్గాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. శశికళ జైలుశిక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 14న ముగియనుంది. ఆ లోగా సత్ప్రవర్తన నియమాల ప్రకారం ఆమె ముందుగానే విడుదలవు తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 
 
అయితే బెంగళూరు జైలు శాఖ ఉన్నతాధికారులు మాత్రం శశికళ ముందుగా విడుదలయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కాగా అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌ వర్గంలో గతంలో అనర్హత వేటుపడిన 18 మంది మాజీ శాసనసభ్యులు అండగా వుండేవారు. 
 
ప్రస్తుతం వారిలో నలుగురైదుగురు మాత్రమే దినకరన్‌ వెంట ఉన్నారు. తక్కిన వారంతా అన్నాడీఎంకేలో, డీఎంకేలో చేరిపోయారు. ఈ పరిస్థితులలో పార్టీని నడపటం దినకరన్‌కు కష్టసాధ్యంగా ఉంటోంది. అందుకే బీజేపీ సహకారంతో తమ పార్టీని అధికార అన్నాడీఎంకేలో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం నాయకులు, ప్రముఖులు, పార్టీ శ్రేణులు అంతగా లేని దినకరన్‌ పార్టీని తమ పార్టీలో ఎందుకు విలీనం చేసుకోవాలంటూ అన్నాడీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే జైలు నుంచి శశికళ విడుదల కాగానే ఆమెకు మద్దతు ఇచ్చేందుకు 10-15 మంది శాసన సభ్యులు సిద్ధమవుతారని దినకరన్‌ తన సన్నిహితులకు చెబుతున్నారు. బీజేపీ వ్యూహం ఫలిస్తుందో, లేక శశికళ వర్గానికి అన్నాడీఎంకే అడ్డుకట్ట వేస్తుందో వచ్చే యేడాది ఫిబ్రవరి 14 నాటికి తెలుస్తుంది.