శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (18:09 IST)

కాశ్మీర్‌లో అలా వెళ్ళిన యువకుడు ఇలా వచ్చేశాడు..?

కాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు యువకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చాలామంది విద్యావంతులను ఉగ్రవాదంలోకి లాగేస్తున్నాయి. దీంతో చాలామంది యువకులు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. అలా మారిపోయిన యువకులు ఇంటి వైపు తిరిగి చూడట్లేదు. తల్లిదండ్రులను, బంధువులను వదిలిపెట్టి.. వెళ్లిపోతున్నారు. 
 
కానీ జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మాత్రం విభిన్నమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, ఖనియార్‌కు చెందిన ఎహతేషాం బిలాల్ సోఫీ (20) నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరాడు. నోయిడాలో ఇంజనీరింగ్ చదువుకున్న కుమారుడు కనపించకపోయేసరికి.. అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి బిలాల్ ఉగ్రవాదిగా మారిపోయాడని తెలుసుకుని అతని తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అంతేగాకుండా.. తమ వంశంలో బిలాల్ ఒక్కడే కుమారుడని.. అతడిని విడిచిపెట్టాలని అతని తల్లిదండ్రులు ఉగ్రవాద సంస్థకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తికి తోడు పోలీసులు కూడా బిలాల్‌ గురించి గాలింపు చర్యలు చేపట్టడంతో బిలాల్ ఆదివారం రాత్రి ఇల్లు చేరాడు. బిలాల్ రాకతో.. అతని తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. అతని వద్ద విచారణ జరిపామని.. అతనిని అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.