గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (10:59 IST)

దటీజ్ వృద్ధ బ్రహ్మచారి ఛరిష్మా... పార్టీ ఓడినా... ఆయన రికార్డులు మాత్రం ఆగలేదు

రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాషాయ కంచుకోట బద్ధలైంది. రాజస్థాన్ వాసులు హస్తానికి పట్టంకట్టారు. అంటే కమల దళం మట్టికరవగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం దక్కించుకుంది. 
 
ఈ క్రమంలో బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైనప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం విజయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనే కైలాష్ మేఘావాల్. 5సార్లు ఎమ్మెల్యేగా, 3సార్లు ఎంపీగా పనిచేశారు. స్పీకర్‌గా పనిచేసిన మేఘవాల్ తన పార్టీ ఓడిపోయినా.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహావీర్‌ ప్రసాద్‌పై 74,542 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
 
అవివాహితుడు అయిన 84 యేళ్ళ కైలాష్.. తాజా ఎన్నికల్లో షాపురా నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈయన 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కైలాశ్‌ పోటీ చేసి...43,666 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి మరో 30 వేల ఓట్లను అదనంగా సాధించి గెలుపొందడం గమనార్హం. 
 
ఉదయ్‌పూర్‌లో 1934 మార్చి 22న జన్మించిన కైలాశ్‌ మేఘవాల్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఈ నియోజకవర్గ వాసులు పార్టీ కంటే ఆయన వ్యక్తిగత ఛరిష్మాకే పట్టంకట్టారు.