శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (13:57 IST)

రాహుల్‌ది ఐరెన్ లెగ్గా... ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి!

కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టి డిసెంబరు 11వ తేదీకి ఒక యేడాది పూర్తయింది. సరిగ్గా అదే రోజున వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. కానీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 
 
దీంతో అనేక మంది రాహుల్ గాంధీది ఐరెన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం నవంబరు 24 నుంచి ఆయన ఆర్భాటంగా సభలు నిర్వహించిన ప్రతి చోటా కాంగ్రెస్‌ అభ్యర్థుల పరాజయం పాలయ్యారు. ఇదే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. 
 
ఎన్నికల శంఖారావం మోగిన వెంటనే గత నెల 24న మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నేతలు భారీ ఎత్తున తొలి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ పాల్గొన్న ఆ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆ సభను చూసిన వారు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని భావించారు. కానీ మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయదుందుభి మోగించారు. 
 
అలాగే, నవంబరు 28న కొడంగల్‌లో భారీ బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌ సభకూ భారీగా ప్రజలు హాజరయ్యారు. కానీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఈ సారి గెలుపు ఖాయం అనుకున్న రేవంత్‌ 9 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 
 
ఆ తర్వాత ఖమ్మంలో రాహుల్‌ సభ ఏర్పాటు చేశారు. రాహుల్‌ పాదం మోపడంతో ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. నిజానికి ఈ సభను మధిరలో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ, కొన్ని కారణాల రీత్యా ఈ సభను రద్దు చేసి ఖమ్మంలో పెట్టారు. దీంతో మధిర నుంచి పోటీ చేసిన భట్టివిక్రమార్క ఊపిరిక పీల్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత రాహుల్‌ సభలు నిర్వహించిన ఆర్మూర్‌, మంచిర్యాల, కొత్తగూడెంలలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.
 
డిసెంబరు 3న గద్వాలలో రాహుల్‌ సభ జరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ ఎవరూ ఊహించని విధంగా ఓటమిని ఎదుర్కొన్నారు. చివరగా ఈ నెల 5వ తేదీన కోదాడలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొన్నారు. కోదాడ నుంచి టీపీసీసీ సారథి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సతీమణ పద్మావతి పోటీలో ఉన్నారు. రాహుల్‌ పాద స్పర్శ పుణ్యమా అని గతంలో సునాయాసంగా విజయం సాధించిన పద్మావతి ఈ సారి పరాజయం పాలయ్యారు. భూపాలపల్లి, పరిగి మాత్రం రాహుల్‌ పాదం ప్రభావానికి కాస్త మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఆ రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.