మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (12:00 IST)

నాకు నరేంద్ర మోడీ పాఠాలు... ఏం చేయకూడదో నేర్పారు : రాహుల్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఫలితాలు చాలా సంతృప్తిగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మెరుగైన ఫలితాలను ఎదురుచూశామని తెలిపారు. మంగళవారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. ఈ ఫలితాలపై రాహుల్ స్పందించారు. 
 
తాను 2014 లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రధాని మోడీకి అవినీతితో సంబంధం ఉందని ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. ఇక మోడీకి ఎన్నికలు చాలా కష్టంగా మారిపోయాయని స్పష్టమైందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉద్యోగకల్పన, అవినీతి నిర్మూలన తదితర హామీలతో మోడీ విజయం సాధించారని, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయన్నారు. 
 
'2014 ఎన్నికలు నాకు చాలా మంచి చేశాయని అమ్మతో చెప్పాను. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా వినయం నేర్చుకున్నాను. నిజానికి నరేంద్ర మోడీనే నాకు పాఠం నేర్పించారు. ఏం చెయ్యకూడదో ఆయన చెప్పారు. మోడీకి ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల గుండెచప్పుడు ఆయన వినలేకపోవడం చాలా బాధాకరం' అని వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై రాహుల్‌ పార్టీ కార్యకర్తలను ప్రశంసించారు. పార్టీ విజయం వారిదేనని, వారు సింహాలని వ్యాఖ్యానించారు.