శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (15:20 IST)

పోలీసుల దౌర్జన్యంతో నో యూజ్.. జల్లికట్టులో ఒక్క ఎద్దు కూడా చనిపోలేదు.. 5 గంటలకు బిల్లు పాస్?

మెరీనా బీచ్ నుంచి జల్లికట్టు ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడం మంచి ఫలితాన్ని ఇవ్వదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు.రిపబ్లిక్‌ డే పరేడ్‌ నేపథ్యంలో ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనం

మెరీనా బీచ్ నుంచి జల్లికట్టు ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడం మంచి ఫలితాన్ని ఇవ్వదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు.రిపబ్లిక్‌ డే పరేడ్‌ నేపథ్యంలో ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవటానికి ప్రయత్నించడంలో భాగంగా పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీనిపై ప్రముఖులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఫైర్ అవుతున్నారు. ప్రముఖ నటులు కమల్‌హాసన్‌, గౌతమి, శిబిరాజ్‌ ట్వీట్ల ద్వారా పోలీసుల వ్యవహారాన్ని తప్పుబట్టారు.
 
జల్లికట్టు ఉద్యమంలో విద్యార్థుల సత్యాగ్రహంపై పోలీసుల దౌర్జన్యం ఏమాత్రం మంచి ఫలితాన్ని ఇవ్వదని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.  అలాగే 'ప్రియమైన తమిళనాడు పోలీసులారా. ఆందోళనకారులపై దౌర్జన్యం చేసి ఇన్నాళ్లూ మీరు సంపాదించుకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇది తప్పు!' అని సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇక 'శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం హింస. ఇక్కడ అహింసకు గౌరవం లేదు, ఇది మా విషాదగాథ' అని గౌతమి ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు.. జల్లికట్టు ఉద్యమకారులను చైన్నై మెరీనా బీచ్ నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు తీసుకున్న చర్యను బీజేపీ నేత సుబ్రహ్మణ స్వామి స్వాగతించారు. ఉద్యమకారుల డిమాండ్లన్నీ అంగీకరించినందున నిరసనలు కొనసాగించడంలో అర్ధం లేదన్నారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో చట్టం చేయబోతున్నప్పుడు నిరసనలు కొనసాగించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అయితే జల్లికట్టు క్రీడను ఆయన సమర్థించారు. ఈ క్రీడలో ఎప్పుడూ ఒక్క ఎద్దు కూడా చనిపోలేదన్నారు.
 
జంతులవులపై కూరత్వం అనేదే క్రీడలో లేదని చెప్పారు. 'జల్లికట్టు క్రీడే జంతువులపై జరుగుతున్న క్రూరంగా భావిస్తే హలాల్ మాంసం కూడా నిషేధించాలి. పెటా పూర్తిగా మన సంప్రదాయాలు తెలియని విదేశీయులతో నిండిన సంస్థ' అని స్వామి విమర్శించారు.
 
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టుకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలు తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా మొన్న జారీ చేసిన ఆర్డినెన్స్‌ను బిల్లుతో భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్‌ పి.ధన్‌పాల్‌ తెలిపారు. 
 
ప్రభుత్వం సోమవారం సాయంత్రం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుండటంతో ఆందోళనకారులు శాంతించాలని సినీ నటులు రాఘవ లారెన్స్‌, ఆర్‌.జె. బాలాజీలు విజ్ఞప్తి చేశారు. పోలీసులు కొన్ని రోజులుగా ఆందోళనలకు బాగా సహకరించారని రాఘవ లారెన్స్ తెలిపారు.