సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (09:01 IST)

భార్యకు తుపాకీ పేల్చడం నేర్పిస్తానన్నాడు.. కానీ ఏం జరిగిందంటే?

భార్యకు తుపాకీ పేల్చడం నేర్పిస్తానని ఓ భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తుమకూరు జిల్లా డి. కొరటిగెరె గ్రామానికి చెందిన కృష్ణప్ప (35), శారద (28) భార్యా భర్తలు. తన భార్యకు తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇస్తానని చెప్పాడు కృష్ణప్ప. సోమవారం రాత్రి తన స్నేహితుడి వద్దనున్న నాటు తుపాకీని తీసుకొచ్చి.. ఎలా కాల్చాలో చూపించాడు. 
 
కానీ ఏం జరిగిందో ఏమో గానీ.. ఆ తుపాకీ పేలి శారద మరణించింది. పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ నేరుగా ఆమె తలలో దిగింది. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే శారద కుప్పకూలి మరణించింది. తుపాకీ పేలిన శబ్ధం విని స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
మృతురాలి భర్త కృష్ణప్పతో పాటు నాటు తుపాకీ వాడుతున్న అతడి మిత్రుడిని కూడా అరెస్ట్ చేశారు. ఐతే కృష్ణప్ప తన భార్యను కావాలనే చంపేశాడా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.