గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2024 (15:14 IST)

మాజీ భర్త నుంచి నెలకు రూ. 6 లక్షలు భరణం ఇప్పించాలా?: కర్నాటక హైకోర్టు జడ్జి తిరస్కరణ

court
తన నెల ఖర్చులకు తన మాజీ భర్త నుంచి రూ. 6,16,300 ను భరణంగా ఇప్పించాలంటూ ఓ మహిళ కర్నాటక హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పరిశీలించి అందులో ఆమె చేసిన అభ్యర్థనను స్వీకరించడానికి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. ఆమెకి నెలకు అంత ఖర్చు అయితే స్వయంగా సంపాదించుకుని ఖర్చు చేసుకోవచ్చని చురకలు అంటించారు. భరణం పేరుతో భర్తను బాధించే చర్యలకు కోర్టు సిద్ధంగా వుండదనీ, నెలకు ఖచ్చితంగా ఎంతవుతుందో తెలుసుకుని వాస్తవ గణాంకాలతో రావాలని ఆదేశించారు.
 
కర్నాటక హైకోర్టు విచారణకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. మహిళ తరపున వాదిస్తున్న న్యాయవాది ఆమె మాజీ భర్త నుండి నెలవారీ నిర్వహణ మొత్తాన్ని రూ. 6,16,300 పొందేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు. న్యాయమూర్తి అతని వాదనలను పట్టించుకోవడానికి నిరాకరించారు, ఎవరైనా నెలకు రూ. 6 లక్షలు ఎలా ఖర్చు చేస్తారని అడిగారు. ఇంత మొత్తం నెలకి భరణంగా అడగడం అసమంజసంగా పేర్కొన్నారు.
 
మోకాళ్ల నొప్పులు, ఫిజియోథెరపీ, మందులు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ. 4 నుండి 5 లక్షలు అవసరమని మహిళ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రాథమిక అవసరాలు కోసం గాజులు, చెప్పులు, గడియారాలు మొదలైన వాటి కోసం నెలకు రూ. 50,000, ఆహారం కోసం రూ. 60,000 డిమాండ్ చేసింది.
 
ఈ అభ్యర్థనను కోర్టు ఎంతమాత్రం ఆమోదించదనీ, భర్త రూ. 6 కోట్లు ఆర్జిస్తే... రూ. 5 కోట్లును భార్యకు భరణం ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ లెక్కలన్నీ వాస్తవానికి దూరంగా వున్నాయనీ, అసలైనవి ఇస్తే పరిశీలిస్తామనీ, లేదంటే పిటీషన్ ను తిరస్కరిస్తామంటూ చెప్పారు.