మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (17:53 IST)

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

harsha vardhan
ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు వెళుతున్న ఓ ఐపీఎస్ యువ అధికారి మృత్యువొడిలోకి చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐపీఎస్ అధికారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రంలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
హర్షవర్ధన్ అనే యువ ఐపీఎస్ అధికారి మైసూర్ పోలీస్ అకాడెమీలో శిక్షణ పూర్తి చేసుకుని హాసన్‌‍కు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న హర్షవర్ధన్‌కు హాసన్‌ జిల్లాలో తొలి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆయన ఆదివారం రాత్రి మైసూర్ నుంచి హాసన్‌కు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానిక గురైంది. టైర్ పేలిపోవడంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని, ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. 
 
ఈ ప్రమాదంలో హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, ఏళ్ల తరబడి శ్రమించి, తీరా ఆ శ్రమకు ఫలితం అందుకోవాల్సిన సమయంలో హర్షవర్ధన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని పేర్కొంటూ హర్షవర్ధన్ కుటుంబానికి సంతాపం తెలిపారు.