సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (14:30 IST)

ప్రేమ వివాహం చేసుకున్నాం.. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అందుకే చనిపోతున్నాం...

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కులాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటను కుటుంబ సభ్యుల మూర్ఖత్వం కాటేసింది. ఇద్దరూ కలిసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బెంగుళూరులోని గౌరీపాళ్యకు చెందిన రక్షిత (24), శేషాద్రి (27) మూడేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇద్దరి కుటుంబ సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 
 
నెల క్రితం వారిని ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుండి వెళ్లిపోయి విడిగా కాపురం పెట్టారు. అయితే బెంగళూరు విధానసౌధలో కేస్‌ వర్కర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ సహాయంతో కుటుంబ సభ్యులు తమను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ నెల 7న జగ్జీవన్‌రామ్‌ నగర ఠాణాలో వీరు ఫిర్యాదు చేశారు. 
 
తమకు ప్రాణహానికి భయపడి ఇద్దరూ నగరం విడిచి చిక్కమగళూరు జిల్లా మూడిగెరెకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనకు కలత చెందిన వారు సోమవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో, తమ వివాహం గురించి, గంగాధర్‌, కుటుంబ సభ్యుల బెదిరింపుల గురించి చెప్పి, చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఇదే తమ చివరి వీడియో అని కూడా వీడియోలో చెప్పారు. జేజేనగర ఠాణా పోలీసులు మూడిగెరెకు వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.