1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:13 IST)

బాధ్యత వదిలేసిన రాహుల్.. సంక్షోభ సమయంలో వెన్ను చూపడమా?

pj kirien
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత పీజే కురియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంక్షోభంలో ఉంటే బాధ్యత వదిలేసి పారిపోవడమా అంటూ నిలదీశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడం ఆయన నిలకడలేమి తనానికి నిదర్శనమని పీజే కురియన్ వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ, పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో అధ్యక్షుడుగా ఆయన ముందుడి పోరాడాలి. ఓడ మునిగిపోతుంటే కెప్టెన్ దాన్ని వదిలేసి పారిపోరాదు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించాలి. దీనికి బదులు ఆయన తన చుట్టూ ఉన్నవారితో కారణాలు చర్చించారు. పైగా, ఆయన చుట్టున్నవారంతా తగినంత అనుభవం లేనివారేనని గుర్తుచేశారు. ఓడను విడిచిపెట్టి పారిపోకుండా రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ తన బాధ్యతలను వదిలివేసిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉందన్నారు. అయినాకానీ, అన్ని విధాన నిర్ణయాలను రాహులే తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. పార్టీ అధ్యక్ష పదవి వద్దన్న వ్యక్తే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ బాధ్యతలను మరొకరు చేపట్టేందుకు అనుమతించడం లేదు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని పీజే కురియన్ అన్నారు.