1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కేరళలో కుంభవృష్టి : కొండ చరియలు విరిగిపడి ఏడుగురు మృతి

భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైపోతుంది. శనివారం నుంచి విస్తారంగా భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షాలకు కొడచరియలు విరిగిపడటంతో ఏడుగురు మృతిచెందారు. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు పట్టణాలు నదులను తలపిస్తున్నాయి. 
 
ప్రధానంగా కొట్టాయం, పథనంమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీనష్టం వాటిల్లింది. వీటితోపాటు ఎర్నాకులం, త్రిసూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇడుక్కి జిల్లాలో శనివారం సాయంత్రం 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. 
 
మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని డ్యామ్‌లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్‌కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. 
 
అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు.