శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:29 IST)

విమాన ప్రమాదం : కోళికోడ్ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్లతో సహా మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పైగా, ఇక్కడికి వచ్చే విమానాలన్నింటినీ కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 
 
వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి కోళికోడ్‌కు వచ్చిన ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ గత శుక్రవారం రాత్రి టేబుల్‌ టాప్‌ రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా అదుపు తప్పి 35 అడుగుల లోతు కలిగిన లోయలో పడింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌ ఇన్‌ కమాండ్‌ కెప్టెన్‌ దీపక్‌ సాతే, ఆయన కో పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది వరకు మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్‌ సిబ్బంది సహా 190 మంది ఉన్నారని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్‌ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముగిసే వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.