సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 8 ఆగస్టు 2020 (14:21 IST)

కేరళ: టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఎన్ని ఉన్నాయి

కేరళలోని కోళికోడ్ విమానాశ్రయం రన్ వే ప్రమాదకరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రదేశం కంటే ఎత్తయిన తలంపై నిర్మించిన ఇలాంటి రన్‌వేలను టేబుల్ టాప్ రన్‌వే అంటారు. వీటి రెండు చివర్లా లోయ కానీ, కొండ కానీ ఉంటాయి. సాధారణంగా విమానాశ్రయాలన్నీ పూర్తి సమతలంగా ఉన్న ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. కానీ పర్వతాలు, పీఠభూమి ప్రాంతాల్లో అయితే టేబుల్ టాప్ రన్‌ వేలు నిర్మిస్తారు.

 
టేబుల్ టాప్ రన్ వే అంటే చుట్టూ ఉన్న ప్రదేశం కన్నా ఎత్తయిన ఉపరితలంపై నిర్మించిన రన్ వే అని అర్థం. టేబుల్ ఉపరితలం సమతలంగానే ఉంటుంది. కానీ టేబుల్ ఉపరితలం దాటి ఏదైనా వస్తువు వెళ్తే అది కింద పడిపోవాల్సిందే. ఇదేవిధంగా ఈ ఎయిర్ పోర్ట్‌లలో రన్ వేలు కూడా పొడవైన టేబుల్ ఆకారంలో ఉంటాయి. రన్ వే చివర దాటిన తర్వాత లోయ ఉంటుంది. కొన్నిచోట్ల కొండ ఉంటుంది.

 
భారతదేశంలో ఇలాంటి టేబుల్ టాప్ రన్ వేలు 3 విమానాశ్రయాలలో ఉన్నాయి. అందులో ఒకటి కేరళలోని కోళికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. ఇక రెండోది కర్నాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కాగా, మూడోది మిజోరాంలో ఉన్న లెంగ్ పుయీ ఎయిర్ పోర్ట్.

 
ప్రమాదకరమైనా ఎందుకిలా నిర్మిస్తారు?
సాధారణంగా విమానాశ్రయాలను సమతలంగా ఉన్న ప్రదేశంలోనే నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ లోయలు, కొండలు ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా నిర్మించాల్సి వచ్చినప్పుడు సమతల ప్రాంతం దొరకదు. అప్పుడు టేబుల్ టాప్ రన్ వేలే నిర్మించాల్సిన పరిస్థితి.

 
నేపాల్‌లో 4 టేబుల్ టాప్ రన్‌వేలు
మన పొరుగు దేశం నేపాల్లో ఎక్కువ భాగం హిమాలయ పర్వత సానువుల్లో ఉండటం వల్ల ఇక్కడ నాలుగు విమానాశ్రయాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. నేపాల్ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో టేబుల్ టాప్ రన్ వే ఉంది.

 
భారత వందో విమానాశ్రయంలో..
భారత్‌లో నిర్మితమైన వందో విమానాశ్రయంగా సిక్కింలోని పాక్యాంగ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కూడా ఇలా కొండల మధ్యే ఉంటుంది. కానీ ఇక్కడ రన్ వే టేబుల్ టాప్ కాదు. దీనికి ఒక చివర మాత్రమే లోయ ఉంటుంది. మరో చివర పూర్తి సమతలంగా ఉంటుంది. కాబట్టి పైలట్లు లోయ వైపు నుంచి ల్యాండ్ అయి పూర్తి సమతలంగా ఉన్న ప్రాంతంలో విమానం ఆగేలా చేస్తారు. అలాగే టేకాఫ్ సమయంలోనూ సమతలం వైపే ఎగిరేలా చేస్తారు.

 
టేబుల్ టాప్ ల్యాండింగ్ అత్యంత ప్రమాదకరం...
టేబుల్ టాప్ రన్‌వేపైన టేకాఫ్, ల్యాండింగ్ రెండూ చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలా ఉపరితలం నుంచి ఎత్తుగా ఉన్న రన్ వేలు పైలట్లకు దృశ్య భ్రాంతిని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది ప్రమాదాలకు దారి తీస్తుంది. అందుకే అత్యంత నైపుణ్యం ఉన్న పైలట్లు మాత్రమే ఈ టేబుల్ టాప్ రన్‌వేల మీద సురక్షితంగా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలరు.

 
సాధారణంగా సమతలంగా ఉన్న రన్ వే మీద నుంచి విమానం జారిపోతే అది కేవలం పక్కకు వెళ్తుంది. ప్రమాదం జరిగినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. టేబుల్ టాప్ రన్ వే నుంచి విమానం జారితే నష్టం తీవ్రంగా ఉంటుంది.

 
టేబుల్ టాప్ మీదనే ఎక్కువ ప్రమాదాలు
ఇప్పటి వరకూ ఇలా వర్షం పడినప్పుడు విమానాలు రన్ వే మీద నుంచి జారిపోయిన ఘటనలు చాలానే జరిగాయి. కానీ ఇదే ప్రమాదం టేబుల్ టాప్ మీద జరిగినప్పుడు రన్ వే దాటి వెళ్లిన విమానం లోయలో పడిపోతుంది. దీనివల్ల ప్రమాద తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. తాజాగా కోళికోడ్ విమాన ప్రమాదంలో విమానం రెండు ముక్కలైపోయింది కూడా ఇందుకే.

 
2010 మే 22 వేకువజామున మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రన్ వే మీద కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు దుబయి నుంచి మంగళూరు వస్తున్న IX 812 విమానం కూడా రన్ వేను దాటి ముందుకెళ్లి లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు.

 
ఇది భారతదేశ ఏవియేషన్ ప్రమాదాల్లో అతి ఘోర దుర్ఘటనగా మిగిలిపోయింది. ఆనాటి ప్రమాదంలో కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు కూడా... విమానం రన్ వే దాటి లోయలో పడ్డప్పుడు విమానం నుంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. విమానం టచ్ డౌన్ పాయింట్ కన్నా మరింత ముందుకెళ్లి ల్యాండ్ చెయ్యడం వల్లనే రన్ వే చాలక విమానం లోయలో పడిపోయినట్లు దర్యాప్తు నివేదిక తేల్చింది.

 
గతంలోనే అభ్యంతరాలు
కోళికోడ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే విషయంలో గతంలోనే విమానయాన రంగ నిపుణుల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా భారీ విమానాల రాకపోకల సమయంలో ప్రమాదానికి ఆస్కారం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది సంవత్సరాల కిందట ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రన్ వే చివరన అదనంగా కొంత సేఫ్టీ ఏరియా కల్పించింది. అయితే, ఇది కూడా చాలదని కొందరు నిపుణులు పేర్కొన్నారు.

 
వైమానిక భద్రత కోసం పనిచేసే యాక్టివిస్ట్, లాయర్ యశ్వంత్ షెనాయ్ తాజా ప్రమాదంపై మాట్లాడుతూ ఇలాంటి ఘోరం ఊహించినదేనన్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం రన్‌వేయేనని ఆయన అనకపోయినప్పటికీ ఈ ప్రమాదం తననేమీ ఆశ్చర్యపరచలేదని చెప్పారు. ''ఏ విమానాశ్రయానికైనా రన్‌వేకు రెండు చివర్లా కనీసం 150 మీటర్ల స్థలం ఉంచాలి. కోళికోడ్ ఎయిర్‌పోర్టులో ఇలా లేదు.

 
అంతేకాదు, ఇది వెడల్పైన విమానాలకు ఏమాత్రం అనువైనది కాదు. ఇంకా చెప్పాలంటే చాలా ప్రమాదకరం కూడా. కానీ, ఏటా ఇక్కడ నుంచి హజ్ యాత్రకు విమానాలు వెళ్తుంటాయి. అవన్నీ పెద్ద విమానాలే. ఈ విషయం గుర్తు చేస్తూ డీజీసీఏకు నేను వేల మెయిళ్లు పంపించాను. కానీ, ఇంతవరకు దీనిపై స్పందన శూన్యం. అందుకే ఈ ప్రమాదం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఈ ప్రమాదం తరువాత భారత్‌లో వైమానిక భద్రత అంశంపై ప్రపంచం దృష్టిపెడుతుందని ఆశిద్దాం'' అన్నారాయన.

 
ఐసీఏవో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా?
''ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) సూచించిన నిర్దిష్ట కనీస ప్రమాణాలను విమానాశ్రయాల్లో పాటించాలి. లైసెన్సులు ఇవ్వడానికి ముందే ఈ ప్రమాణాల ప్రకారం అంతా ఉందో లేదో పరిశీలించడానికి ప్రతి దేశంలో ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది.

 
భారత్‌లో డీజీసీఏ చేయాల్సిన పని అదే. ఏదైనా విమానాశ్రయంలో ప్రమాణాలు పాటించకపోతే ఆ సంగతి బయటకుచెప్పాలి.. అందరికీ సమాచారం ఇవ్వాలి. అప్పుడు అలాంటి విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో మంచి అనుభవజ్ఞులైన పైలట్లనే పంపుతారు'' అన్నారాయన.

 
నెపం వర్షంపై నెట్టేయలేం’
''కారణాలు అప్పుడే చెప్పడం సరికాదు. అయితే, వర్షం పడుతుండడంతో వాతావరణం కూడా కొంత కారణం అయ్యుండొచ్చు.. కానీ, నెపం వర్షంపై నెట్టేయలేం. పైలట్లు దారుణమైన వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాలు నడిపించిన సందర్భాలున్నాయి'' అన్నారు యశ్వంత్. కర్ణాటకలోని మంగళూరులో 2010 మే 22న జరిగిన ప్రమాదం తరువాత యశ్వంత్ భారత్‌లో విమాన ప్రమాదాలపై దృష్టిపెట్టారు. వైమానిక భద్రత కోసం ఆయన కృషి చేస్తున్నారు.