1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (15:23 IST)

కిరణ్ రిజిజుకు షాకిచ్చిన ప్రధాని మోడీ.. న్యాయ శాఖ నుంచి ఉద్వాసన

kiran jijiju
కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజిజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఝులక్ ఇచ్చారు. ఆయన్ను న్యాయశాఖ నుంచి తప్పించారు. ఆయన స్తానంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రాం మేఘావాల్‌కు న్యాయ శాఖను అదనంగా కేటాయించారు. అలాగే, కిరణ్ రిజిజుకు భూ విజ్ఞాన శాస్త్ర (ఎర్త్ సైన్స్) శాఖామంత్రిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. కేంద్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అర్జున్ మేఘ్వాల్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా.. ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. కాగా.. కేబినెట్ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
మరోవైపు ప్రస్తుతం భూవిజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చూస్తుండగా.. ఇప్పుడు ఆ శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు. జితేంద్ర సింగ్ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధితోపాటు పలు శాఖలు ఉన్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, అర్జున్ రామ్ మేఘ్వాల్.. రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది ఆఖరులో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
 
కాగా, న్యాయ శాఖ నుంచి కిరణ్ రిజుజును తప్పించడాని కారణాలు లేకపోలేదు. జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజిజు గతేడాది నవంబరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని అప్పట్లో ఆయన అభిప్రాయపడగా, ఇది దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల వేళ న్యాయశాఖ మంత్రి మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.