ఎట్టకేలకు తెరపడిన కర్నాటక పంచాయతీ.. సీఎంగా సిద్ధూ.. డిప్యూటీగా డీకే
కర్నాటక పంచాయతీకి ఎట్టకేలకు ముగింపు కార్డు పలికింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మిస్టర్ క్లీన్‌గా గుర్తింపు పొందిన సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పేరును ఎంపిక చేసింది. వీరిద్దరు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
గురువారం తన నివాసంలో సిద్ధరామయ్యతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వీరిద్దరితో పాటు కొందరు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణం చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు కేపీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్ కొనసాగుతారని, డిప్యూటీ సీఎంగా ఆయన ఒక్కరే ఉంంటారని తెలిపారు. కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, నియంతృత్వాన్ని కాదని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పలు సమావేశాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి సమర్థులని, ఇద్దరూ తమ పార్టీ పెద్ద ఆస్తి అని చెప్పారు. కర్నాటక ప్రజలతో అధికారాన్ని పంచుకోవడమే తమ పవర్ షేరింగ్ ఫార్ములా అని వేణుగోపాల్ తెలిపారు. 6.5 కోట్ల కన్నడ ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను తక్షణం అమలు చేస్తామని వేణుగోపాల్ తెలిపారు.