పాక్‌కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు టమాటాలను ఎగుమతి నిలిపివేసినట్టు ప్రకటించారు. ముఖ్యంగా కోలార్ టమాటా వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌కు టమాటా ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని వారు తీర్మానించారు. ఈ నిర్ణయంతో ఆర్థిక నష్టాన్ని భరించడానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన కోలార్‌లో రోజుకు సుమారు 800 నుంచి 900 టన్నుల టమాటా లావాదేవీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా, జూన్ నెల టమాటా రైతులకు, వ్యాపారులకు అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో ఎగుమతులు అత్యధికంగా ఉంటాయి. అయినప్పటికీ పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రయోజనాలే ముఖ్యమని వారు అంటున్నారు. అందువల్ల ఇకపై పాకిస్థాన్‌కు టమాటాల ఎగుమతిని నిలిపివేస్తున్నట్టు వారు ప్రకటించారు.
గతంలో ఉగ్రవాదులు జరిగినప్పటికీ మానవతా దృక్పథంతో పాకిస్థాన్‌కు టమాటా ఎగుమతులు కొనసాగించామని, కానీ పహల్గాంలో అమాయక యాత్రికులపై జరిగిన దాడి తర్వాత తమ వైఖరి మార్చుకున్నామని వ్యాపారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒక్క టమాటా కూడా ఆ దేశానికి పంపబోము అని వారు దృఢంగా చెప్పారు. తమ ఆదాయం కంటే దేశ భద్రత, గౌరవమే తమకు ముఖ్యమని వారు పేర్కొన్నారు.