శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (17:06 IST)

అతిరథ మహారథులు తరలిరాగా.. అట్టహాసంగా కుమార పట్టాభిషేకం

పలువురు జాతీయ అగ్రనేతలు తరలిరాగా.. హెచ్.డి.కుమార స్వామి పట్టాభిషేక ఘట్టం కన్నులపండుగగా జరిగింది. కన్నడ విధాన సౌథ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా కుమార స్వా

పలువురు జాతీయ అగ్రనేతలు తరలిరాగా.. హెచ్.డి.కుమార స్వామి పట్టాభిషేక ఘట్టం కన్నులపండుగగా జరిగింది. కన్నడ విధాన సౌథ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా కుమార స్వామి బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు.
 
కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి.. 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర (67) ప్రమాణ స్వీకారం చేశారు. పీహెచ్‌డీ పట్టా పొంది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన పరమేశ్వర ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆయనకు గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టానికి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ సుప్రీమో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజశ్వీ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేద్రీవాల్, అజిత్ సింగ్, కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, మల్లిఖార్జు ఖర్గే, సిద్ధరామయ్య, పరమేశ్వర్, లెఫ్ట్ పార్టీ నేతలు సీతారాం ఏచూరీ, హెచ్.రాజా, కేరళ సీఎం పినరాయి విజయన్, ఇలా అనేక మంది ప్రముఖులు తరలివచ్చారు. 
 
వీరందరి సమక్షంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మాజీ ప్రధాని దేవెగౌడ పేరుపేరునా పలుకరిస్తూ, ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేవెగౌడ దంపతులు, వారి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.