పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్
కర్నాటక అసెంబ్లీలో సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప ఓ వినూత్న డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్ళ ఉచిత మద్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారన్నారు. ఇందుకోసం మళ్లీ పన్నులు పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నానని, అభ్యంతరం చెప్పొద్దని ఆయన కోరారు. మద్యం ఆదాయంలో మహిళలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుందన్నారు.
మందుబాబులకు ఏవీ ఇవ్వడం లేదని, అందువల్ల మద్యం తాగే వారికి ప్రతి వారం రెడు మద్యం బాటిళ్లు ఉచితంగా ఉవ్వాలని ప్రతిపాదన చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఇంధన మంత్రి కేజే జార్జ్ స్పందిస్తూ దీన్ని మీరు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమలు చేయండని సూచించారు. ప్రజలు మద్యం తక్కువ తాగేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు, జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదనన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే తాజా ప్రతిపాదన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మందుబాబులను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికలు సమయంలో ఉచిత మద్యం హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ చేస్తున్నారు.