శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:33 IST)

మతం పేరుతో హత్యలా?: శశిథరూర్

హిందూ మతం పేరుతో మనుషులను హత్య చేయడమంటే హిందూ ధర్మాన్ని, రాముడిని అవమానించడమేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ)లో ఆయన మాట్లాడుతూ, సంఘటిత భారతం అంటే మతం పేరుతో హింసకు పాల్పడటం కాదని అన్నారు.

రాముడి నినాదం ఇవ్వలేదని తబ్రెజ్ అన్సారీని విచక్షణారహితంగా కొట్టారని, రాముడి పేరు చెప్పుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడమంటే హిందూ ధర్మానికే కాకుండా, రాముడికి కూడా అవమానమేనని శశిథరూర్ అన్నారు.

సంఘటిత భారతం దిశగా పయనించడమంటే స్వాతంత్ర్య పోరాటం గురించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని ప్రస్తావించాలని, సంఘటిత భారతం అందరిదీనని, మతం, భాష, రంగు, వర్ణాలకు అతీతమని అన్నారు.

'గత ఆరేళ్లుగా మనం ఏమి చేస్తున్నాం? పుణెలో మొహిసిన్ షేక్‌తో మొదలైంది. ఆ తర్వాత బీఫ్ పట్టుకెళ్తున్నాడనే అనుమానంతో మెహమ్మద్ అఖ్లక్‌ను చంపేశారు. ఆ తర్వాత అది బీఫ్ కాదని తేలింది. ఒకవేళ అది బీఫ్ అయినప్పటికీ ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరిచ్చారు?' అని ప్రశ్నించారు.

పెహ్లూ ఖాన్‌కు డెయిరీ ఫార్మింగ్ కోసం తన లారీలో ఆవులు తీసుకెళ్లేందుకు లైసెన్స్ ఉందనీ, అతన్ని కొట్టిచంపారని అన్నారు. ఒక ఎన్నికల ఫలితమే వారికి ఎవరినైనా కొట్టి చంపేందుకు, ఏదైనా చేసేందుకు అవసరమైన బలాన్ని ఇచ్చిందా?' అని నిలదీశారు.

15 ఏళ్ల బాలుడు జునైద్ ఖాన్‌ను రైలులో కత్తితో పొడిచి చంపారని, ఇదేనా మన భారతం? మనం హిందూ ధర్మం చెప్పింది ఇదేనా?' అని ప్రశ్నించారు. సంఘటిత భారతం అంటే...మహాత్మాగాంధీ చెప్పినట్టు సమాజంలోని బలహీన వర్గాలను ఆదుకుని, వారికి దిశానిర్దేశం చూపించడం మన బాధ్యతని శశిథరూర్ అన్నారు.