సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (19:00 IST)

అటల్ జీ మృతికి తెలుగు చంద్రుల సంతాపం.. అంత్యక్రియలు.. సాయంత్రం 5 గంటలకు?

మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి పట్ల బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. వాజ్ పేయి సీనియర్ నాయకుడు మాత్రమే కాదని, అరవై నాలుగేళ్లుగా తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్‌లో ప్రచార

మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి పట్ల బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. వాజ్ పేయి సీనియర్ నాయకుడు మాత్రమే కాదని, అరవై నాలుగేళ్లుగా తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్‌గా చేరినప్పటి నుంచి వాజ్ పేయితో తనకు అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అటల్ జీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటల్ జీ మరణంతో దేశం గొప్పనాయకుడిని కోల్పోయిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.
 
భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సంతాపం వ్యక్తం చేశారు. భారత రాజకీయ భీష్ముడు వాజ్ పేయి అని, గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంత కర్త, వక్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్, ఒక్క ఓటుతో ప్రభుత్వం ఓడిపోయినా చలించని మేరునగధీరుడు వాజ్ పేయి అని కొనియాడారు. 
 
మాజీ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి మృతికి సీఎం శ్రీ కేసీఆర్ ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, మాజీ ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త.. నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన అట‌ల్జీ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని సీఎం ఆకాంక్షించారు. 
 
ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. వాజ్ పేయి పార్థివదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక, ప్రజలు, అభిమానులు, మద్దతుదారుల సందర్శనార్థం శుక్రవారం ఉదయం 9 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్ పేయి పార్థివదేహాన్ని తరలించనున్నారు.
 
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అలాగే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో వాజ్ పేయి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.