సోమవారం, 4 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (15:09 IST)

అద్వానీకి భారతరత్న : ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!

advani bharat ratna
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆదివారం అందజేశారు. అద్వానీ ఇంటికి వెళ్లి మరీ ఈ పురస్కరాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నిజానికి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అద్వానీ ఆరోగ్యం సహకరించలేకపోవడంతో హాజరుకాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 
 
ఇటీవల పలువురికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే. వీటిని శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. మరణానంతరం పీవీకి ప్రకటించిన భారత రత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకున్నారు. మాజీ ప్రధాని దివంగత చరణ్ సింగ్, హరిత పిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌లకు ప్రకటించిన భారతరత్న పురస్కారాలను వారివారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌధరి, స్వామినాథన్ కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్‌లు అందుకున్నారు. 
 
అయితే, అనారోగ్య సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి అద్వానీ హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్ళారు. భారత రత్న అవార్డును అద్వానీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.