తిరువనంతపురంలో చేపల వ్యాపారికి కరోనా.. 119 మందికి సోకింది..
కేరళ తిరువనంతపురంలో కరనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది కేరళలోని పుంథూరా, తిరువనంతపురం గ్రామాల నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కేరళలోని సముద్ర తీర గ్రామం పుంథూరాలో 119 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.
ఈ 119 మందికి ఓ చేపల వ్యాపారి ద్వారా కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, అతడిని కలిసిన వారికి పరీక్షలు చేసి 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీంతో అక్కడికి ఆరు ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటాయి. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.