శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (17:58 IST)

వరదలు.. గర్భిణీకి పురిటినొప్పులు... ప్లాస్టిక్ ట్యూబ్ బోట్‌లో ఆస్పత్రికి.. వైరల్

Bihar
ఒకవైపు కరోనా మరోవైపు భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల పాటు ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 
 
కొన్ని గ్రామాల ప్రజలకు కొండ చరియలు విరిగిపడి రోడ్లు మూతపడ్డాయి. మరికొన్ని గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రజలు ఊరుదాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి చేర్చలేని పరిస్థితి. 
 
ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని అషారా గ్రామంలో గర్భవతిని ఆస్పత్రి చేర్చడంపై నానా తంటాలు పడ్డారు.. ఆమె కుటుంబీకులు. భారీ వర్షాల కారణంగా అషారా గ్రామం పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఊరు చుట్టూ దాదాపు ఆరు అడుగుల లోతున నీరు నిలిచింది. 
 
అయితే, ఇదే సమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను రబ్బర్ ట్యూబ్‌తో తయారు చేసిన చేతి పడవపై ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. 
 
గర్భిణీ స్త్రీని, ఆమె తల్లిని ఉంచడానికి స్థానికులు, ఆమె కుటుంబీకులు ఒక ట్యూబ్ బోట్ నిర్మించి దానిపై కలపను ఉంచారు. నాలుగైదు మంది యువకులు మహిళను, ఆమె తల్లిని ఏదో ఒక విధంగా నీటిలో ఈదుతూ వైద్యుని వద్దకు చేర్చిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.