గురువారం, 28 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2025 (14:28 IST)

గదిలో నిద్రపోయిన బాలిక- తాళం వేసిన సిబ్బంది- రాత్రంతా చిన్నారి నరకం.. కిటికీలలో తల చిక్కుకుంది (video)

Student
Student
ఒడిశాలో ఓ చిన్నారి నరకం అనుభవించింది. సిబ్బంది నిర్లక్ష్యం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్కూల్ గదిలోనే నిద్రపోయిన రెండో తరగతి బాలికను గమనించకుండా తాళం వేసి వెళ్లిపోవడంతో ఆ పాప రాత్రంతా నరకయాతన అనుభవించింది. బయటకు వచ్చే ప్రయత్నంలో కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. 
 
అయితే, రెండో తరగతి చదువుతున్న ఓ బాలిక తరగతి గదిలోనే నిద్రలోకి జారుకుంది. దీన్ని గమనించని సిబ్బంది గదిని తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది. 
 
ఉదయాన్నే పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు ఓ గది కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుని, తీవ్ర గాయాలతో వేలాడుతున్న చిన్నారి కనిపించింది. ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఎంతో శ్రమించి బాలికను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.