సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (15:55 IST)

లోక్‌సభ మాజీ స్పీకర్ చనిపోయిందంటూ ట్వీట్... స్పందించిన సుమిత్రా మహాజన్

లోక్‌సభ మాజీ స్పీకర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత సుమిత్రా మహాజన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం రీట్వీట్ చేయడంతో మరింత గందరగోళ చెలరేగింది. దీంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. సుమిత్రా మహాజన్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత శశిథరూర్ సహా మిగతా వారంతా తమ ట్వీట్లను డిలీట్ చేశారు. 
 
గురువారం రాత్రి నుంచి మొదలైన ఈ ప్రచారంపై సుమిత్రా మహాజన్ స్పందిస్తూ.. 'ఎలాంటి ధ్రువీకరణ లేకుండా వీళ్లంతా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేసేది? ఇలా వార్తలు చెప్పేముందు కనీసం ఇండోర్ జిల్లా అధికారులనైనా కనుక్కుని ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరుతున్నా' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు సుమిత్రా మహాజన్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ను ఆమె కుమారుడు మందార్ ట్విటర్లో పోస్టు చేశారు. 'ఈ వార్త దేశం మొత్తం వ్యాపించింది. ముంబైలోని నా బంధువులు సైతం నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఈ తప్పుడు వార్త ఎవరు చెప్పారంటూ ట్విటర్లో శశి థరూర్‌ని నా తమ్ముడి కూతురు నిలదీసింది' అని ఆమె పేర్కొన్నారు. 
 
ముంబైలోని కొన్ని న్యూస్ చానెళ్లు సైతం ఎందుకు తన మరణంపై తప్పుడు వార్తలు ఫ్లాష్ చేశాయోనంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కాగా మహాజన్‌పై ట్విటర్లో పెట్టిన పోస్టును డిలీట్ చేసిన అనంతరం శశిథరూర్ స్పందిస్తూ... 'ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అంతకు మించిన ఉపశమనం లేదు. నమ్మకమైన చోట నుంచి నాకు సమాచారం అందడంతో అది నిజమేనని అనునుకున్నాను' వివరణ ఇచ్చారు. 
 
అనంతరం మరో ట్వీట్‌లో స్పందిస్తూ... 'సుమిత్రా మహాజన్ కుమారుడితో మాట్లాడాను. గత రాత్రి చోటుచేసుకున్న తప్పుడు ప్రచారం గురించి క్షమాపణ చెప్పాను. ఆయన దయతో నన్ను అర్థం చేసుకున్నారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషం కలిగింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను' అని శశిథరూర్ పేర్కొన్నారు.