సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:29 IST)

గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం .. ఒక్క రోజే...

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఆస్పత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. ఈ ఆస్పత్రిలో ఒక్క రోజే ఏకంగా 20 మంది వరకు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో భయానకపరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా దారుణంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కూడా 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు పెద్ద ఎత్తున మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే 38 మృత్యువాత పడ్డారు. బుధవారం 18 మంది రోగులు మృతి చెందగా, గురువారం 20 మంది మరణించినట్టు టిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇషాన్ అహ్మద్ తెలిపారు. 
 
అయితే, ఇలా మరణిస్తున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గత ఐదు రోజులుగా టిమ్స్‌లో ఇదే పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. నిన్న పటాన్‌చెరులోని ఓ ఆసుపత్రిలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు.