సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (12:08 IST)

అయోధ్యపై వివాదాస్పద పోస్ట్.. మహారాష్ట్రలో వ్యక్తి అరెస్టు

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధులే జిల్లాలోని ఓల్డ్ ఆగ్రా రోడ్డు నివాసి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు. సోషల్ మీడియాపై నిఘా వేసిన అధికారులు ఈ పోస్టును కనుగొన్నారు. ఈ నేపధ్యంలో అతనిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. 
 
మరోవైపు, అయోధ్య తీర్పు దరిమిలా, భారత్, నేపాల్‌ల సరిహద్దును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూసివేసింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ మేరకు సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఎవరినీ సరిహద్దులోనికి రానివ్వడం జరగదని హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. అలాగే ప్రయాణికులకు,రైల్వే స్టేషన్‌లు, రైళ్లలో ఉన్న ప్రయాణికుల సంరక్షణకు సంబంధించి రైల్వే సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. 
 
ఇదిలావుంటే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్ తదితర ముఖ్య అధికారులతో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.