శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన టీడీపీ నేత మనువడు

విశాఖపట్టణం జిల్లాలో నిరుద్యోగులకు ఓ టీడీపీ నేత మనువడు కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు రెడ్డి గౌతమ్‌‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
తన భార్య మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్ అధికారి అని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని గౌతమ్ ప్రచారం చేసుకున్నాడు. దీంతో అతని మాటలు నమ్మిన అనేక మంది ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించారు. ఈ విషయంలో అతని భార్య లోచిని కూడా సహకరించినట్టు సమాచారం. 
 
అమ్మ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ద్వారా నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన గౌతం వారికి తప్పుడు నియామక పత్రాలు అందించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.