సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (14:17 IST)

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడివుండాల్సిందే : సుప్రీంకోర్టు

supreme court
ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడివుండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. పాలనా వ్యవహారాలపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న దానిపై ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నెలకొనివుంది. దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ విషయంలో స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యంగా ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఒక్క శాంతిభద్రతలు మినహా మిగిలిన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. 
 
అంతేకాకుండా, ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వ అధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఇదేసమయంలో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడివుండాలంటూ స్పష్టంచేసింది. 
 
ప్రజల అభీష్టం ప్రతిబింభించేలా చట్టు చేసే అధికారాలు ఢిల్లీకి అసెంబ్లీకి ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారులు.. మంత్రులకు నివేదించడం ఆపివేస్తే లేదా వారి ఆదేశాలకు కట్టుబడి ఉండకపోతే, సమిష్టి బాధ్యత సూత్ర ప్రభావితమవుతుంది అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.