సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (10:28 IST)

విద్యార్థులకు క్రెడిట్ కార్డు: ప్రపంచంలో తొలి పథకం.. 40 ఏళ్ల వరకు..?

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విద్యార్థుల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాన్ని మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద ఎటువంటి ష్యూరిటీ లేకుండా విద్యార్థులు రూ.10 లక్షల వరకూ రుణం పొందవచ్చునని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటరీగా ఉంటుందని, ప్రపంచంలోనే ఇది మొదటి పథకమని అన్నారు. 
 
తాము కన్న కలలను నిజం చేసుకోడానికి పదో తరగతి విద్యార్థుల నుంచి ఈ పథకం వర్తిస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. రూ.10 లక్షల వరకు రుణం తీసుకుని, 15 ఏళ్లలోపు చెల్లించవచ్చు. విద్యార్థులు చదువుల కోసం రుణాలు పొందవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, పశ్చిమ్ బెంగాల్ సివిల్ సర్వీసెస్ సహా ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి, కోచింగ్ కోసం కూడా విద్యార్థులు రుణం పొందవచ్చు’ అని తెలిపారు. క్రెడిట్ కార్డు ద్వారా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ సహ అకడమిక్ సంబంధిత అంశాలకు ఖర్చు చేయవచ్చని తఅన్నారు. అంతేకాదు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి కూడా దీనిని వినియోగించవచ్చన్నారు.
 
కార్డు ప్రత్యేకత ఏమిటంటే.. 40 సంవత్సరాల వయస్సు వరకు దీనికి అర్హులు. 40 ఏళ్ల వయస్సు వరకు కార్డును ఉపయోగించడానికి అనుమతించామన్నారు. ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రుణం తీసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, కార్డుతో మోసాలు జరిగే అవకాశాలపై కూడా మమత హెచ్చరించారు. ఏదైనా మోసానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్డు కోసం రాష్ట్ర విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.