గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (12:59 IST)

ఆరేళ్ల పాటు పెళ్లిచూపులు.. కానీ పెళ్లి కుదరలేదు.. పురుగుల మందు తాగిన..?

చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రేమ వ్యవహారాల వల్ల కొందరు యువత ప్రాణాలు కోల్పోతుండగా, కుటుంబ సమస్యల కారణంగా మరికొందరు ఊపిరి తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే జీవితంపై విరక్తిని తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఓ యువకుడు పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఈ విషయాన్ని గ్రహించి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలను కోల్పోయాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగల మర్రి గ్రామంలో గుర్రాల దేవేందర్ రెడ్డి, సుగుణమ్మ దంపతులకు రాజశేఖర్ రెడ్డి అనే 29 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. స్థానికంగానే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఆరేళ్ల క్రితం నుంచే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఎన్ని సంబంధాలు చూసినా, పెళ్లి కుదరకపోవడంతో అతడు మనస్తాపం చెందాడు. 
 
అమ్మాయి నచ్చినా మొదట్లో కట్నం విషయంలో తేడాలు రావడం, ఆ తర్వాత అమ్మాయి తరపు వాళ్లు పెడుతున్న కండీషన్లకు కుదరకపోవడంతో అతడికి పెళ్లి నిశ్చయం కావడం లేదు. మరికొన్ని సంబంధాలు చూద్దామనీ, పెళ్లి విషయంలో మనస్తాపం చెందొద్దని తల్లి సుగుణమ్మ కొడుక్కు చెప్పుకుంటూ వచ్చేది.
 
ఈ క్రమంలోనే తనకు ఇక జీవితంలో పెళ్లి కాదని కొద్ది రోజులుగా చుట్టుపక్కల వాళ్లతో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నాడు. గురువారం ఉదయం ఇంట్లో తల్లి లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అతడి నోటి నుంచి నురగలు వస్తుండటంతో ఏంటా అని చుట్టుపక్కల వాళ్లు ఆరా తీశారు. 
 
పురుగుల మందు తాగానని వారికి చెప్పాడు. దీంతో వెంటనే వారు అప్రమత్తమపై చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజశేఖర్ రెడ్డి మరణించాడని వైద్యులు తేల్చారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.