శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (16:05 IST)

కరోనా మృతదేహాన్ని పీక్కుతింటున్న వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన!

సాధారణంగా కోవిడ్ రోగిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు. కొవిడ్‌తో మృతి చెందిన‌ కుటుంబస‌భ్యుల మృత‌దేహాల‌ను ముట్టుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా కొవిడ్ మృత‌దేహాన్ని పీక్కుతిన్నాడు. ఒక శ‌వాన్నీ పీక్కుతింటుండ‌డం క‌ల‌క‌లం రేపింది.
 
ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. ఆ దృశ్యాల‌ను కొంద‌రు స్మార్ట్‌ఫోన్ల‌లో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
సతారా జిల్లాలోని ఫల్టాన్​ మున్సిపల్​ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నట్లు స్థానికులు గుర్తించారు. 
 
ఆ తర్వాత స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఆ వెంటనే ఫల్టాన్​ మున్సిపల్​ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వచ్చేలోగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా సాయంత్రానికల్లా అధికారులు అతడిని వెతికి పట్టుకోగలిగారు. 
 
అయితే సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని అధికారులు గుర్తించారు. మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించినట్లు పేర్కొన్నారు.  వైద్య నివేదికలు వచ్చిన అనంతరం దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.