ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (10:00 IST)

రూ.కోటి బీమా సొమ్ముకు ఆశపడి... జైలు ఊచలు లెక్కిస్తున్న ఫ్యామిలీ

కోటి రూపాయల బీమా సొమ్ముు ఆశపడిన ఓ కుటుంబం ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. ఆ కుటుంబానికి సహకరించి మరణ ధృవీకరణ పత్రం జారీచేసిన వైద్యుడు కూడా జైలుపాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనీఫ్ (46) అనే వ్యక్తి సెప్టెంబరు 2019లో ఓ బీమా కంపెనీలో కోటి రూపాయల విలువైన బీమా పాలసీ తీసుకున్నాడు. 
 
రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత ఆ కోటి రూపాయల బీమాను కొట్టేయాలని భావించాడు. ఇందుకోసం వైద్యుడు షకీర్ మన్సూరితో కలిసి పన్నాగం పన్నాడు. తాను మరణించినట్టు మరణ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నాడు. 
 
తర్వాత వాటిని బీమా కంపెనీకి సమర్పిస్తూ, హనీఫ్ భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారి వ్యవహారాన్ని అనుమానించిన సదరు బీమా సంస్థ దేవాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో హనీఫ్ బతికి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో హనీఫ్, రెహానా, ఇక్బాల్‌తోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.