బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (10:20 IST)

ఆస్పత్రిలో కోలుకుంటున్న చిరుత వీరుడు... గ్రామస్థుల ప్రశంసలు

కర్నాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాల్లో చిరుత దాడిలో తలకు బలమైన గాయాలైన చిరుత వీరుడు రాజగోపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ చిరుత తన భార్యా కుమారుడిని చంపేందుకు ప్రయత్నించగా, రాజగోపాల్ తిరగబడి ఆ చిరుతను చంపేసిన విషయం తెల్సిందే. 
 
జిల్లాలోని అరసికెరె తాలూకా బెండిగెరె వద్ద కుటుంబ సభ్యులపై చిరుత దాడిచేస్తుండటాన్ని చూసి.. ప్రాణాలొడ్డి ప్రతిఘటించిన రాజగోపాల్‌ సాహసాన్ని అన్ని వర్గాల ప్రజలూ ప్రశంసించారు. ఈ ఘటనలో చిరుత చనిపోయింది. 
 
పోరాట వేళ చిరుత పంజా విసరడంతో తలకు, భుజంపై రాజగోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని గ్రామస్థులు తెలిపారు. 
 
చిరుతతో దాదాపు 20 నిమిషాలపాటు ఆయన వీరోచితంగా పోరాడారు. ఎన్నిసార్లు పంజాతో దాడిచేసినా రక్త గాయాల బాధను ఓర్చుకుంటూ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దానిపై కట్టెతో దాడిచేసి.. చివరికి మెడను గట్టిగా అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి నేలకొరిగేలా చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ బాగా అలిసిపోయారని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు.