భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
తన భార్యకు రైల్వేలో ఉద్యోగం రావడానికి తన సొంత పొలాన్ని తాకట్టుపెట్టి రూ.15 లక్షల మేరకు ఖర్చు చేశాడు. ఫలితంగా తాను ఊహించినట్టుగానే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత భార్య తన బుద్ధి చూపించింది. మరో వ్యక్తి ప్రేమలోపడి భర్తకు షాకిచ్చింది. భర్తపై వరకట్నంతో పాటు వివిధ రకాలైన కేసులు పెట్టింది. దీన్ని జీర్ణించుకోలోలేని భర్త.. తన భార్యకు తగిన శాస్తి చేశాడు. ఫలితంగా రైల్వే ఉద్యోగ నియామకంలో జరిగిన భారీ స్కామ్ ఒకటి బయటపడింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాకు చెందిన మనీశ్ మీనా 8 నెలల క్రితం రైల్వే అధికారులను కలిశాడు. తన భార్య ఆశా మీనా డమ్మీ అభ్యర్థి ద్వారా రైల్వే ఉద్యోగం సాధించిందని, ఇందుకోసం తాను రూ.15 లక్షలకు పొలాన్ని తాకట్టు పెట్టానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. రైల్వే గార్డు అయిన రాజేంద్ర అనే ఏజెంట్ ద్వారా రూ.15 లక్షలు చెల్లించి డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించినట్టు చెప్పాడు. ఈ డబ్బు కోసం తన పొలాన్ని తాకట్టు పెట్టినట్టు వివరించాడు.
ప్రైవేట్ రైల్వే ఉద్యోగి అయిన మనీశ్ 2022లో ఆశా మీనాను వివాహం చేసుకున్నాడు. మంచి భవిష్యత్తు కోసం ఆశా బంధువు ద్వారా రైల్వే గార్డును కలిశాడు. జబల్‌పూరులోని సీనియర్ రైల్వే అధికారి పేరుతో గార్డు రూ.15 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఆశా మీనాకు బదులుగా లక్ష్మీ మీనా అనే మహిళ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాసి పాసైంది. అనంతరం పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్)లో పాయింట్స్ విమెన్ ఉద్యోగం సంపాదించింది. పలువురు అభ్యర్థుల పేరుతో లక్ష్మీ మీనా పరీక్షలు రాస్తున్నట్టు 2024లో అధికారులు గుర్తించారు. ఆమె ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.
కాగా, ఉద్యోగం సంపాదించిన తర్వాత భర్తతో ఆశాకు విభేదాలు మొదలయ్యాయి. అతడికి ఉద్యోగం లేకపోవడంతో పాటు మరో వ్యక్తితో మనసుపడటంతో భర్తను విడిచిపెట్టింది. అంతేకాదు, మనీశ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న మనీశ్.. రైల్వే అధికారులను కలిసి ఆమె ఉద్యోగం ఎలా సంపాదించిందీ గుట్టు విప్పాడు. విషయం బయటకు రావడంతో గత శుక్రవారం కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.