సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (18:45 IST)

మన్మోహన్‌కు డెంగీ జ్వరం : మాండవీయ చేసిన పనికి కుమార్తె ఫైర్

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు డెంగీ జ్వరం సోకింది. ఇటీవల అస్వస్థతకు లోనైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు డెంగీ ఫీవర్ అని తేలింది. 
 
ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌కు కొన్నేళ్లుగా వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతున్నాయని వైద్య బులిటెన్‌లో వెల్లడించారు. 
 
89 ఏండ్ల మన్మోహన్‌ సింగ్‌ జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో బుధవారం అడ్మిట్‌ అయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆయనకు వైరస్‌ సోకగా ఎయిమ్స్‌లో చేరారు. గత ఏడాది మే నెలలో ఛాతిలో ఇబ్బంది రావడంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.
 
ఇదిలావుంటే మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్‌సుక్ మాండవీయ స్వయంగా పరామర్శించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోటోలపై పెద్ద దుమారమే చెలరేగింది. మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ప్రోటోకాల్‌కు ఇది విరుద్దమన్నారు. అలాగే, మంత్రి మాండవీయ చర్యను కూడా నెటిజన్లు తూర్పారబట్టారు. దీంతో ఆయన ఆ ఫోటోలను తన ఖాతా నుంచి తొలగించారు.
 
ఇదిలావుంటే, పంజాబ్‌ సీఎం చన్నీ, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ఎయిమ్స్‌ను సందర్శించి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.