సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (08:08 IST)

#KarnatakaVerdict కౌంట్‌డౌన్ స్టార్ట్... హంగ్ అసెంబ్లీ తప్పదా?

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాన పక్షాలు కాంగ్రెస్‌, భాజపా, జనతాదళ్‌లో ఏ పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టారనేది మంగళవారం మధ్యాహ్

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాన పక్షాలు కాంగ్రెస్‌, భాజపా, జనతాదళ్‌లో ఏ పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టారనేది మంగళవారం మధ్యాహ్నానికల్లా వెల్లడవనుంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా భారీ పోలింగ్ నమోదైనపుడల్లా ఇదే పరిస్థితి పునరావృతమైనట్టు చరిత్ర చెపుతోంది.
 
అయితే, ఈ దఫా ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భారీ పోలింగ్‌ జరిగినందున సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో ఒక పార్టీకి కచ్చితంగా అధిక్యం లభిస్తుందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు. మరోవైపు, గత 1983, 2004, 2008లో వరుసగా 65.67, 65.17, 64.68 శాతం పోలింగ్‌ నమోదైనపుడు త్రిశంకు సభలు ఏర్పడినట్టు వారు గుర్తు చేస్తున్నారు. 
 
అపుడు 1983లో జనతాపార్టీ భాజపాతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2004లో కాంగ్రెస్‌తో జనతాదళ్‌ చేతులు కలిపింది. 20 నెలల తర్వాత కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి జనతాదళ్‌ పక్కకు తప్పుకొని, భాజపాతో కలసి 20 నెలలపాటు ప్రభుత్వాన్ని నడిపింది. అనంతరం భాజపాకు రాజ్యాధికారాన్ని బదిలీ చేయకుండా మొండిచేయి చూపింది. వాటి పరిణామమే రాష్ట్రపతి పాలన. 
 
ఆ తర్వాత జరిగిన దిగువసభ ఎన్నికల్లో యడ్యూరప్ప నాయకత్వంలోని భాజపా 110 స్థానాల్లో మాత్రమే గెలిచింది. స్వతంత్రులతో కలసి అధికారాన్ని చేపట్టింది. 2013 వరకూ సాగిన పరిపాలనలో ముగ్గురు ముఖ్యమంత్రులు బాధ్యతలను నిర్వర్తించారు. గత విధానసభ ఎన్నికలో పోలింగ్‌ శాతం 71.45. ఈసారి అంతకంటే కాస్త ఎక్కువగా 72.36 శాతం నమోదైంది. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇంత భారీ పోలింగ్‌ లోగడ నమోదవలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 
 
ఒకవేళ త్రిశంకు విధానసభే ఏర్పడితే అధికారాన్ని చేపట్టేందుకు పార్టీలు తగిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటు కుదరని పక్షంలో అతి తక్కువ బలమున్న రాజకీయ పక్షాన్ని చీల్చేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వెనుకంజ వేయబోవనే అంచనాలు ఉన్నాయి.