గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (16:27 IST)

కార్గిల్ మృతుల కంటే.. కరోనా మృతులు కలిచివేస్తున్నాయ్ : మాజీ ఆర్మీ చీఫ్

గతంలో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో అనేక మంది భారత సైనికులతో పాటు.. సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చుట్టేసింది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. 

ఈ మృతులపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ స్పందించారు. గతంలో కార్గిల్ యుధ్దంలో మరణించినవారికన్నా ఈ కరోనా మహమ్మారి సమయంలో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువేనని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. 

దేశంలో ఎన్నికల ర్యాలీలు, రైతుల నిరసనలు కూడా ఈ కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్గిల్ వార్ రెండు నెలలపాటు కొనసాగిందని, ఆ వార్‌లో మృతి చెందిన వారికన్నా ఈ కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య రెండున్నర రెట్లు ఎక్కువగా ఉందని ఆయన గుర్తుచేశారు. 

ఆదివారం ఒక్క రోజే 1300 మందికి పైగా రోగులు మరణించారని ఆయన గుర్తుచేశారు. ఈ వార్ మీద దేశం ఫోకస్ పెట్టిందా అని అని ఆయన ప్రశ్నించారు. కాగా, కార్గిల్ యుధ్ద సమయంలో వీపీ మాలిక్ భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలు, ఢిల్లీలో రైతుల నిరసనలు ఇలాంటివి కరోనా కేసులు పెరగడానికి దోహద పడ్డాయని, ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తోందని ప్రశ్నించారు. 

దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయిని తాను ఊహించలేదన్నారు. భారత్... మేల్కో అ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిపై ఓ మాజీ సైనికాధికారి స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.