డెంగ్యూ వ్యాధిగ్రస్తుడి మృతి.. ప్లాస్మా బదులు పండ్ల రసం ఎక్కించారు..
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ డెంగ్యూ వ్యాధిగ్రస్తుడు ప్రాణాలు కోల్పోయాడు. డెంగ్యూతో బాధపడుతున్న ఓ రోగికి ప్లేట్ లెట్ ల పేరుతో వైద్యులు పళ్లరసం ఎక్కించారు.. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో చోటుచేసుకుంది. రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రికి సీల్ వేయడం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జ్వరంతో బాధపడుతున్న 32 ఏళ్ల యువకుడిని బంధువులు ప్రయాగ్ రాజ్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ యువకుడు డెంగ్యూతో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చారు. ఈ క్రమంలో ప్లాస్మా ఎక్కించాల్సింది పోయి... పండ్ల రసం ఎక్కించారు.
ప్లాస్మా పేరుతో పళ్లరసం ఎక్కించడం వల్లే రోగి ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. దీంతో గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఆందోళనలపై యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్లాస్మా ప్యాకెట్లను పరీక్ష కోసం పంపించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.