మధ్యప్రదేశ్‌లో వరదలు.. మొరాయించిన బోటు.. మంత్రిని అలా కాపాడారు..
మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి నరోత్తం మిశ్రాను సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. వరద నీటిలో బోటులో ప్రయాణిస్తుండంగా బోటుపై ఓ చెట్టు పడిపోవటంతో మంత్రి ప్రయాణించే బోటు ఆగిపోయింది.
ఈ క్రమంలో ఆ చుట్టు పక్కలంతా వరదనీరు చుట్టుముట్టటంతో మంత్రిని హెలికాప్టర్ సహాయంతో పైకి లాగి రక్షించారు. కాగా మధ్యప్రదేశ్ లో పలు జిల్లాల్లో పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. దీంతో వరద నీరు ఉప్పొంగుతోంది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడా చూసిన వరదనీటితో పలు గ్రామాలు జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో అనేక గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే, హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా.. వరద ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు.
వరద సహాయం చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించటానికి బాధితులకు ధైర్యం చెప్పటానికి వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో బాధితులను రక్షించేందుకు బోటులో ఓ ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ చెట్టు మంత్రి ప్రయాణించే బోటుపై పడింది. దీంతో బోటు అక్కడే ఆగిపోయింది. బోటు మోటారు మెరాయించింది.
అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి పైకప్పు మీదకు ఎక్కి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అతి కష్టం మీద మంత్రి నరోత్తం మిశ్రా బోటులో ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. చుట్టూ వరద నీరు ఎగసిపడుతోంది.
ఈ నీటిలో ప్రవహిస్తుండడంతో ఆయన కూడా వారితో బోటు ఆ ఇంటిపైనే చిక్కుకుపోయారు.. ఎటూ వెళ్లే దారి లేక మంత్రి సిబ్బంది అధికారులకు ఫోన్ లో మెసేజ్ పంపడంతో అధికారులు వైమానిక దళాన్ని సంప్రదించి ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్ పంపారు.
అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ పైనుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని ఆయన పైకి సురక్షితంగా చాపర్ లోకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు.