శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మిస్టర్ మోడీ : మా మూడు నిమిషాల వీడియో చూడండి..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రయెన్ ట్విట్టర్ వేదిక ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. మిస్టర్ మోడీ.. మా మాట వినండి… అంటూ టీఎంసీ 3 నిమిషాల వీడియోను ట్విట్టర్‌లో విడుదల చేసింది. 
 
పార్లమెంట్ సమావేశాలు కొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్ష సభ్యులు మాట్లాడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ చట్టాలపై గత కొద్దిరోజులుగా పార్లమెంట్‌‌లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు హాజరుకావాలని.. ప్రతిపక్ష నాయకుల డిమాండ్లను వినాలని టీఎంసీ నాయకులు ప్రధాన మంత్రిని కోరారు. గత 14 రోజులుగా తాము డిమాండ్ చేస్తున్న అంశాలపై చర్చకు అనుమతించడం లేదని, ధైర్యం వుంటే ఇప్పుడే చర్చలు ప్రారంభించాలని కాంగ్రెస్ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తోంది. 
 
పార్లమెంట్‌లో వాక్ స్వాతంత్ర్యం ఉంటుందని టీఎంసీ ఎంపీ సుఖేందు వెల్లడించారు. ప్రభుత్వం అనవసరంగా ప్రజలను మోసగిస్తోందని, పెగాసస్ వంటి కంపెనీలను తీసుకొస్తోందంటూ… నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ వందన చవాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జులై 19వ తేదీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ ప్రసంగాల కోసం, కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులను పరిచయడం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకసారి పార్లమెంట్‌కు హాజరయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పెగాసస్, వ్యవసాయ చట్టాలు, ఇతరత్రా కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ స్తంభిస్తోంది.