1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఉద్యోగులకు చిల్లర నాణేల రూపంలో వేతనాలు.. ఎక్కడ?

దేశంలో చిల్లర నాణేలకు విలువ లేకుండా పోతోంది. 10, 20, 25 పైసలు నాణేలు ఇపుడు కంటి కనిపించకుండా పోయాయి. అదేసమయంలో రూ.1, రూ.5, రూ.10, రూ.20, రూ.100 నాణేలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ నాణేల ఉపయోగం ఇపుడు గణనీయంగా తగ్గిపోతుంది. కరెన్సీ నోట్ల వినియోగమే జోరుగా సాగుతోంది. 
 
తాజాగా మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగుల‌కు చిల్ల‌ర రూపంలో జీతాలు ఇస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లోని బృహాన్ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌) యాజమాన్యం. బ‌స్సుల్లో టికెట్ల విక్రయం ద్వారా ప్రతిరోజు బస్‌ డిపోలకు రూ.లక్షల్లో చిల్లర నాణేలు వ‌స్తున్నాయి. దాదాపు రూ.12 కోట్లకు పైనే ఈ నాణేలు ఆ సంస్థ‌‌ ప్రధాన కార్యాలయం కొలాబాలోని బస్‌ భవన్‌లో భద్రపరిచారు. 
 
ఈ నాణేలను ఏం చేయాలో ఆర్టీసీ అధికారులకు తెలియలేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డానికి వెళ్తే అంత చిల్ల‌ర తీసుకుని లెక్క‌పెట్టుకోవాలా? అంటూ బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో చిల్లర నాణేలను ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది.
 
ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో రూ.15 వేలను చిల్లర నాణేలుగా, మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని నిర్ణ‌యం తీసుకుంది. చిల్ల‌రను తీసుకెళ్ల‌డానికి ఉద్యోగులు సంచుల‌తో డిపోల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. 
 
బృహాన్ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వ‌ర్యంలో న‌డిచే బ‌స్సుల్లో మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస బస్సు చార్జీ రూ.5గా ఉంది. ఆ తర్వాత వ‌రుస‌గా టికెట్ ధ‌ర‌లు రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు వున్నాయి.
 
బ్యాంకుల‌ సిబ్బంది చిల్ల‌ర‌ డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపుగా ప్ర‌ధాన కార్యాల‌యంలోనే పేరుకుపోయాయి. ఆ  సంస్థ ప‌రిధిలో దాదాపు 40 వేల మందికిపైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వేతనాల్లో కొంత చిల్ల‌ర రూపంలో చేతికి, మ‌రికొంత బ్యాంకుల్లో వేయాల‌ని సంస్థ తీసుకున్న‌ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.