శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (23:28 IST)

ఎండలు మండుతున్నాయి, ఈ ఆహారం తీసుకుంటే మేలు

ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసు నీరు తీసుకుంటే చాలు శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువ త్రాగడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌కు దూరంగా ఉంచవచ్చు. వేసవిలో మంచినీటికి మించిన పానీయం వేరే లేదు. మనకు మార్కెట్‌లో లభించే వీటిని తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
పుచ్చకాయ: ఈ పుచ్చకాయ ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లోనైనా అందుబాటులో ఉంటుంది. అయితే వేసవిలో మాత్రం దీనిని విరివిగా తింటారు. ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
 
గ్రిల్డ్ వెజిటేబుల్స్: ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండల వల్ల వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షిస్తాయి.
 
సలాడ్స్: వేసవికాలంలో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. అంతేకాకుండా దోసకాయ వంటి వాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
 
ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. అంతేగాక చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్లనే వేసవికాలం వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిది.
 
వేపుళ్లు, కారం, మసాలాలను తినడం వీలైనంత వరకు తగ్గించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినడం ఉత్తమం.