శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (12:59 IST)

రుణదాతల కోర్కె తీర్చమన్న భర్తలు... గర్భందాల్చితే అబార్షన్ మందులు ఇస్తున్నారు...

ముంబైలో ఓ దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చేసిన అప్పులు చెల్లించలేని ఆ భర్తలు.. తమ భార్యలను రుణదాతల కోర్కెలు తీర్చేందుకు పంపిస్తున్నారు. అందుకు నిరాకరిస్తే పుట్టింటికి వెళ్లి లక్షల్లో కట్నం తేవాలంటూ హింసిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ముంబై నగరంలోని విరార్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎంబీఎస్టేట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులను వివాహమాడారు. దీంతో వీరిద్దరూ తోడికోడళ్లుగా మారిపోయారు. ఈ క్రమంలో వీరి భర్తలిద్దరూ తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశారు. ఈ అప్పులు తిరిగి చెల్లించలేక పోయారు. దీంతో తమ భార్యలను రుణదాతల వద్దకు వెళ్లి వారి కోర్కెలు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చారు. వారికి అత్తమామలు కూడా వంతపాడారు. 
 
దీంతో ఏం చేయాలో తోచని ఆ తోడికోడళ్లు అయిన అక్కాచెల్లెళ్లు.. నేరుగా పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబానికి రుణాలిచ్చిన రుణదాతల కోరిక తీర్చమని తమ భర్తలే తమను ఒత్తిడి చేశారని అక్కాచెల్లెళ్లు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త లక్షన్నరరూపాయల రుణం తీసుకొని వసాయి హోమ్స్‌లోని ఓ రుణదాత కోరిక తీర్చమని తనను పంపించాడని 24 ఏళ్ల వివాహిత పేర్కొంది. 
 
అలాగే, తన అత్తమామలు, భర్తల ముందే ఓ బంధువు తనను లైంగికంగా వేధిస్తున్నా వారు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని మరో వివాహిత (22) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. తమకు రుణాలిచ్చిన వారి కోరికైనా తీర్చండి... లేకుంటే పుట్టింటి నుంచి రూ.5 లక్షల డబ్బుఅయినా తీసుకురండి అంటూ వేధిస్తున్నారని ఆ అక్కాచెల్లెళ్లు బోరున విలపిస్తూ వెల్లడించారు. 
 
పైగా, ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించేందుకు మందులు ఇస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో రుణదాతలతో పాటు.. ఆ అక్కాచెల్లెళ్ల భర్తలు పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.