మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:10 IST)

భారీ పోలీస్ బందోబస్తు.. శోభా డే ట్వీట్‌కు పోలీస్ ఫైర్.. ట్రీట్మెంట్ కోసం డబ్బిస్తే...?

సోషల్ మీడియాలో వివాదాలకు తావిచ్చేలా ట్వీట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే ప్రముఖ రచయిత, కాలమిస్టు శోభా డే మరోసారి కూడా అదేపని చేశారు. మంగళవారం ముంబైలో జరిగిన బీఎంసీ ఎన్నికల సందర్భంగా 'భారీ పోలీసు బందోబస్

సోషల్ మీడియాలో వివాదాలకు తావిచ్చేలా ట్వీట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే ప్రముఖ రచయిత, కాలమిస్టు శోభా డే మరోసారి కూడా అదేపని చేశారు. మంగళవారం ముంబైలో జరిగిన బీఎంసీ ఎన్నికల సందర్భంగా 'భారీ పోలీసు బందోబస్తు' అంటూ లావుగా ఉన్న ఓ పోలీసు ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అధిక బరువున్న ముంబై పోలీసును చూపిస్తూ సరదాగా జోక్ చేసేందుకు ప్రయత్నిస్తే.. అది పెద్ద వివాదానికి దారితీసింది. 
 
ఈ పోస్టు ముంబై పోలీసులను అవమానించేలా ఉందంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అసలు శోభా డే పెట్టిన పోస్టులో ఉన్న పోలీస్ ఫోటో ముంబైకి చెందిన వారిది కాదన్నారు. భుజంపై ఉన్న బ్యాడ్జీ ఆధారంగా.. అది మధ్యప్రదేశ్ పోలీసు కావచ్చునంటూ మరికొందరు కామెంట్ చేశారు. కాగా మరికొందరు నెటిజన్లు మాత్రం 'ముంబై పోలీసులు ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నించాలి' అంటూ శోభాడేకు సానుకూలంగా స్పందించారు. 
 
కానీ ముంబై పోలీసులు మాత్రం శోభాడేకి సరైన షాక్ ఇచ్చారు. ఒక బాధ్యతగల వ్యక్తిగా ఇలాంటివి వినాల్సి రావడం బాధాకరమన్నారు. శోభాడే అపహాస్యాలు కూడా మేము ఇష్టంగా స్వీకరించగలం కానీ, ఇది మాత్రం పూర్తిగా తప్పుడు సందేశం ఇచ్చేలా ఉందన్నారు. శోభా డేలాంటి బాధ్యతాయుతమైన పౌరుల నుంచి ఇంకా మంచి విషయాలు ఆశిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. 
 
ఇక బాధిత పోలీసు వ్యక్తి ఏమన్నారంటే? శోభా డే మేడమ్ తనకు సహాయం చేయాలన్నారు. ఇన్సులిన్ నియంత్రించలేకపోవడంతో ఊబకాయం ఆవహించిందని.. మీరు కనుక డబ్బులిస్తే ట్రీట్మెంట్ చేసుకుంటానని ఝలక్ ఇచ్చాడు. మరి శోభా డే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
 
ఇదిలా ఉంటే.. గతంలో రియో క్రీడాకారుల పట్ల కూడా శోభా డే విమర్శలు గుప్పించారు. భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృధా అని గంతంలో శోభా ట్వీట్ చేశారు. దీనిపై  వివిధ రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.